Palakollu: ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయుల సన్మానం

Palakollu: పాలకొల్లులో మంత్రి నిమ్మల రామానాయుడు ధర్మారావు ఫౌండేషన్ ద్వారా ఉత్తమ ఉపాధ్యాయ దంపతులను సత్కరించి, గురువుల ప్రాధాన్యతను కొనియాడారు.

S VENKAT, PALAKOLLU
Published on: 5 Oct 2026 10:55 PM IST
Palakollu
X

Palakollu: ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయుల సన్మానం

పాలకొల్లు: తల్లిదండ్రులు జన్మనిస్తే.. ఉపాధ్యాయులు ఆ జన్మకు అర్థాన్ని చూపిస్తారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్‌ నిమ్మల రామానాయుడు అన్నారు. ఒక మంచి ఉపాధ్యాయుడు పాఠాలు మాత్రమే బోధించడని.. జీవితాన్ని ఎలా గెలవాలో నేర్పిస్తారని పేర్కొన్నారు. విద్యార్థి విజయమే తన విజయంగా భావించి, సమాజానికి మంచి పౌరులను తీర్చిదిద్దే గురువుల సేవకు విలువ కట్టలేమన్నారు. గురువు చేతిలోని చాక్‌ ముక్క.. ఒక విద్యార్థి భవిష్యత్తును మార్చే శక్తి కలిగిన కలం వంటిదన్నారు. ఉపాధ్యాయుడిని గౌరవించడం అంటే.. మన భవిష్యత్తును గౌరవించడమేనని పేర్కొన్నారు.

పాలకొల్లులోని శ్రీరామచంద్ర గార్డెన్స్‌లో సోమవారం సాయంత్రం అంతర్జాతీయ గురుపూజోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ధర్మారావు ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో పాలకొల్లు నియోజకవర్గానికి చెందిన ఉత్తమ ఉపాధ్యాయులను దంపతుల సమేతంగా మంత్రి నిమ్మల రామానాయుడు ఘనంగా సన్మానించారు. శాలువాలు కప్పి, గజమాలలు వేసి, ప్రశంసాపత్రాలు అందజేసి గౌరవించారు. ప్రతి ఉపాధ్యాయుడిని మంత్రి ఆప్యాయంగా అభివాదం చేసి సత్కరించారు.

ఈ సందర్భంగా మంత్రి రామానాయుడు మాట్లాడుతూ ఉపాధ్యాయులు, అధ్యాపకులతో తనకు ఎంతో అనుబంధం, గౌరవం ఉందన్నారు. పాఠశాల విద్యార్థి దశ నుంచి ఆంధ్ర విశ్వవిద్యాలయం వరకు విద్యాభ్యాసం సాగించడంతోపాటు, పదేళ్లపాటు నర్సాపురంలోని వైఎన్‌ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేసిన అనుబంధం తనకు ఉందన్నారు. ఆ అభిమానంతోనే తన తండ్రి ధర్మారావు పేరిట ఏర్పాటు చేసిన ధర్మారావు ఫౌండేషన్‌ ద్వారా గత 11 ఏళ్లుగా ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరించడం ఆనవాయితీగా కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

సమాజంలోని అన్ని వృత్తుల్లోకెల్లా ఉపాధ్యాయ వృత్తి ఎంతో గౌరవప్రదమైనదని అన్నారు. నేటి భావి భారత పౌరులను తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. ప్రతి ఉపాధ్యాయుడు కేవలం బోధనకే పరిమితం కాకుండా.. క్రమశిక్షణ, ఉన్నత విలువలతో కూడిన విద్యను అందిస్తూ విద్యార్థులను మంచి మార్గంలో నడిపించే మార్గదర్శకులుగా నిలవాలని సూచించారు.

ప్రజాసేవలోనే నిజమైన ఆనందం

రాజకీయాల్లో మంత్రి పదవి ఉందన్న గర్వం కంటే ప్రజలకు సేవ చేయడంలోనే తనకు నిజమైన ఆనందం, సంతోషం కలుగుతుందని రామానాయుడు అన్నారు. తాను రాజకీయాల్లోకి రాకముందే ధర్మారావు ఫౌండేషన్‌ను ఏర్పాటు చేసి నిరంతరం అనేక ప్రజాహిత సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తాను ఏ స్థాయిలో ఉన్నా ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని, భవిష్యత్తులోనూ అదే విధంగా సహకరిస్తానని భరోసా ఇచ్చారు.

2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసిన ఘనత చంద్రబాబు.

దేశంలోనే డీఎస్సీ ద్వారా 2 లక్షల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసిన ఘనత చంద్రబాబు అని మంత్రి రామానాయుడు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు డీఎస్సీ ఫైల్ పై తొలి సంతకం చేసి, 16,340 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశారన్నారు.

పాదయాత్ర లో అధికారంలోకి వస్తే, ప్రతి ఏటా డీఎస్సీ, మెగా డీఎస్సీ అని చెప్పిన జగన్ అధికారంలోకి వచ్చాక ఐదేళ్లలో ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించకుండా, ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేయలేదన్నారు. ఈ ఏడాది తమ ప్రభుత్వం డీఎస్సీ నిర్వహించి మరో మారు టీచర్ పోస్టులను భర్తీ చేస్తుందన్నారు.

డీఎస్సీలో కష్టపడి ఉద్యోగాలు సాధించిన టీచర్లను ప్రతిపక్ష హోదా కూడా లేని పార్టీ అవమానిస్తూ, వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా అవహేళన చేస్తున్నారనీ, క్రీడల్లో ప్రతిభ చాటి, నిబంధనల ప్రకారం డీఎస్సీలో ఉపాధ్యాయునిగా పొందిన వారిని ఫేక్ అంటూ అవమానించడం సరికాదన్నారు.

గత ప్రభుత్వంలో జరిగిన గ్రూప్ వన్ అక్రమాలపై ప్రజల దృష్టి మళ్లించేందుకే, మెగా డీఎస్సీ పై ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారానికి పాల్పడుతున్నారన్నారు.

ఈ కార్యక్రమంలో హైదరాబాద్కు చెందిన హాస్యబ్రహ్మ శంకర నారాయణ, నాయకులు కోడి విజయభాస్కర్, పెచ్చెట్టి బాబు, గండేటి వెంకటేశ్వరరావు ,ఉన్నమట్ల కబర్ది, జక్కంపూడి కుమార్, ఎర్రం శెట్టి పద్మారావు, అల్లూరి పద్మవర్మ, మహమ్మద్ జానీ, రియా, మామిడి శెట్టి పెద్దిరాజు, విన్నకోట గోపి, ఎంఈఓ శర్మ, హెచ్ఎం వై ప్రభాకర్ శాస్త్రి, రావూరి వెంకట అప్పారావు, పీతల శ్రీనివాస్, ఆరేటి ప్రకాష్, కేవీ కృష్ణ వర్మ, మద్దాల రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు, వారి కుటుంబ సభ్యులతో సహా పాల్గొన్నారు. అందరికీ గౌరవంగా భోజనాలను మంత్రి రామానాయుడు ఏర్పాటు చేశారు .

S VENKAT, PALAKOLLU

S VENKAT, PALAKOLLU