Palakollu: అంతర్జాతీయ క్రికెట్‌లో పాలకొల్లు యువకుడి ప్రతిభ!
Palakollu: నేపాల్ వేదికగా జరిగిన అంతర్జాతీయ క్రికెట్ ఛాంపియన్‌షిప్‌లో భారత జట్టు రన్నరప్‌గా నిలవగా, పాలకొల్లు యువకుడు షేక్ సమీర్‌ఉద్దీన్ కెప్టెన్‌గా వ్యవహరించారు.
Palakollu: అంతర్జాతీయ క్రికెట్‌లో పాలకొల్లు యువకుడి ప్రతిభ!
Palakollu: నేపాల్‌లోని సిద్ధార్థనగర్ వేదికగా నిర్వహించిన YOUTH GAMES FOUNDATION INTERNATIONAL CRICKET CHAMPIONSHIP అంతర్జాతీయ క్రికెట్ టోర్నమెంట్‌లో భారత జట్టు రన్నరప్‌గా నిలిచింది. ఈ పోటీల్లో భారత్, నేపాల్, భూటాన్ దేశాల జట్లు పాల్గొన్నాయి.
ఈ టోర్నమెంట్‌లో YOUTH GAMES FOUNDATION TEAM INDIAకు పాలకొల్లు మండలానికి చెందిన షేక్ సమీర్‌ఉద్దీన్ కెప్టెన్‌గా వ్యవహరించారు. భారత జట్టు తొలి మ్యాచ్‌లో నేపాల్‌తో తలపడి 2 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. అనంతరం భూటాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది.
కెప్టెన్ షేక్ సమీర్‌ఉద్దీన్ బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ ప్రతిభ కనబరిచారు. నేపాల్‌పై జరిగిన మ్యాచ్‌లో 3 ఓవర్లలో 12 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు సాధించారు. మరో మ్యాచ్‌లో 4 ఓవర్లలో 20 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీశారు. బ్యాటింగ్‌లో 10 బంతుల్లో 20 పరుగులు సాధించి జట్టు విజయానికి తన వంతు సహకారం అందించారు.
భారత్–నేపాల్ జట్లు ఫైనల్‌కు అర్హత సాధించాయి. అయితే భారీ వర్షం కారణంగా ఫైనల్ మ్యాచ్‌ను ఒక రోజు వాయిదా వేసినప్పటికీ, అనంతరం కూడా వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఫైనల్ మ్యాచ్ రద్దు చేశారు. టోర్నమెంట్ నిబంధనల ప్రకారం రన్‌రేట్ ఆధారంగా భారత జట్టును రన్నరప్‌గా ప్రకటించారు.
పాలకొల్లు నుంచి ముగ్గురు క్రీడాకారుల ఎంపిక ఈ అంతర్జాతీయ పోటీలకు పాలకొల్లు మండలం నుంచి ముగ్గురు క్రీడాకారులు భారత జట్టుకు ఎంపిక కావడం విశేషం. షేక్ సమీర్‌ఉద్దీన్ – కెప్టెన్
చౌదరి కార్తిక్ కుమార్ – బ్యాట్స్‌మన్
జక్కంపూడి భానుశ్రీ కృష్ణ – బ్యాట్స్‌మన్
ముఖ్యంగా కెప్టెన్ షేక్ సమీర్‌ఉద్దీన్ పాలకొల్లు మండలం బ్రాడీపేట 5వ వీధికి చెందిన యువకుడు కావడం స్థానికంగా గర్వకారణంగా నిలిచింది. అంతర్జాతీయ స్థాయి క్రికెట్ పోటీల్లో భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించి, తన ప్రతిభను చాటుకోవడం పట్ల స్థానిక విద్యార్థులు, యువత, క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
“చదువు–పోరాటంతో పాటు ఆటల్లోనూ విజయాలు సాధిస్తాం” ఏఐఎస్ఎఫ్ పశ్చిమగోదావరి జిల్లా సభ్యుడు షేక్ సమీర్‌ఉద్దీన్ మాట్లాడుతూ, విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా ముందుకు రావాలని, క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని అన్నారు.
“ఏఐఎస్ఎఫ్ విద్యార్థుల చదువు కోసం మాత్రమే కాకుండా, విద్యార్థులు మరియు యువతలోని ప్రతిభను వెలికితీసి అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తుంది. చదువు కోసం పోరాడుతూనే, ఆటల్లో కూడా విజయాలు సాధిస్తాం. విద్యార్థి యువతకు క్రీడలు ఒక గొప్ప వేదిక. ప్రతి గ్రామం, ప్రతి విద్యాసంస్థలో క్రీడా ప్రతిభను ప్రోత్సహించాలి” అని అన్నారు. అంతర్జాతీయ క్రికెట్ పోటీల్లో భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించి రన్నరప్‌గా నిలిపిన షేక్ సమీర్‌ఉద్దీన్‌తో పాటు చౌదరి కార్తిక్ కుమార్, జక్కంపూడి భానుశ్రీ కృష్ణలను పలువురు విద్యార్థి, యువజన సంఘాల ప్రతినిధులు అభినందించారు.




