Penumantra: మార్టేరు పీహెచ్‌సీలో గర్భిణీలకు ఉచిత భోజనం, నగదు ప్రోత్సాహకం

Penumantra: మార్టేరు పీహెచ్‌సీలో సాధారణ ప్రసవాలను ప్రోత్సహించేందుకు గర్భిణీలకు ఉచిత భోజనం, రూ.2,500 నగదు ప్రోత్సాహకం ప్రకటించిన టీడీపీ నాయకుడు అచ్యుత రామారెడ్డి.

E.ABRAHAM, ACHANTA
Updated on: 11 Aug 2026 10:38 PM IST
Penumantra
X

Penumantra: మార్టేరు పీహెచ్‌సీలో గర్భిణీలకు ఉచిత భోజనం, నగదు ప్రోత్సాహకం

పెనుమంట్ర: ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలపై నమ్మకాన్ని పెంచడంతో పాటు సాధారణ ప్రసవాల సంఖ్యనుప్రోత్సహించేందుకు మార్టేరు గ్రామ ప్రముఖ వ్యాపారవేత్త, టీడీపీ నాయకుడు, మార్టేరు పీహెచ్‌సీ మాజీ చైర్మన్ కర్రి అచ్యుత రామారెడ్డి తనవంతు సహాయాన్ని అందిస్తున్నారు. ఆచంట నియోజకవర్గ ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ సహకారంతో మార్టేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని ఆయన తెలిపారు.

మార్టేరు పీహెచ్‌సీకి నెలవారీ వైద్య పరీక్షల కోసం వచ్చే గర్భిణీలకు ప్రతి నెల ఉచితంగా భోజనం అందించే కార్యక్రమాన్ని అచ్యుత రామారెడ్డి చేపట్టారు. ప్రస్తుతం పీహెచ్‌సీ పరిధిలో సుమారు 95 మంది గర్భిణీలు ఉన్నారు. వారికి క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు గర్భధారణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పోషకాహారం, సాధారణ ప్రసవానికి పాటించాల్సిన సూచనలపై వైద్య సిబ్బంది అవగాహన కల్పిస్తున్నారు.

ప్రసవానికి రూ.2,500 ప్రోత్సాహకం

ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలనే ఉద్దేశంతో అచ్యుత రామారెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మార్టేరు పీహెచ్‌సీలో ప్రసవం చేయించుకునే ప్రతి మహిళకు తనవంతుగా రూ.2,500 ప్రోత్సాహకంగా అందిస్తామని ప్రకటించారు. అంతేకాకుండా తల్లీబిడ్డలకు ఉపయోగపడే శిశు కిట్‌ను కూడా ఉచితంగా అందించనున్నట్లు తెలిపారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని, గర్భిణీలు వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. సాధారణ ప్రసవాల శాతం పెంచేందుకు వైద్య సిబ్బంది, గర్భిణీలు, వారి కుటుంబ సభ్యులు సమన్వయంతో ముందుకు సాగాలని కోరారు.

గర్భిణీలకు ప్రతి నెల ఉచిత భోజనం అందించడంతో పాటు ప్రసవ సమయంలో ఆర్థిక ప్రోత్సాహకం, శిశు కిట్ అందించేందుకు ముందుకు వచ్చిన అచ్యుత రామారెడ్డి సేవాభావాన్ని పీహెచ్‌సీ సిబ్బంది, గర్భిణీలు అభినందించారు. ప్రభుత్వ వైద్య సేవలపై ప్రజల్లో విశ్వాసం పెంచే ఇలాంటి కార్యక్రమాలు అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో "డాక్టర్ " డి. మల్లిక, డాక్టర్ పవన్ కుమార్, సిహెచ్ఓ శంకర్, పిహెచ్సి హెడ్ నర్స్ ఇవాంజలి గర్భిణీ స్త్రీలు, ఏ ఎన్ ఎం లు ఆశ వర్కర్లు పిహెచ్ సిబ్బంది పాల్గొన్నారు.

E.ABRAHAM, ACHANTA

E.ABRAHAM, ACHANTA

Next Story