Penumantra: పెనుమంట్ర స్మశానంలో చెత్త కుప్పలు.. గ్రామస్తుల ఆగ్రహం

Penumantra: వెలగలేరులో స్మశాన వాటికను చెత్త కుప్పగా మార్చిన పంచాయతీ. మృతదేహాలను ఖననం చేసేందుకు స్థలం లేక ఇబ్బందులు. అధికారుల తీరుపై గ్రామస్తుల తీవ్ర ఆగ్రహం.

E.ABRAHAM, ACHANTA
Published on: 17 July 2026 6:45 PM IST
Penumantra
X

Penumantra: పెనుమంట్ర స్మశానంలో చెత్త కుప్పలు.. గ్రామస్తుల ఆగ్రహం

పెనుమంట్ర: వెలగలేరు గ్రామంలో పరిస్థితి మరింత దారుణంగా మారింది. స్మశాన వాటిక అనే పవిత్ర స్థలం ఇప్పుడు చెత్త కుప్పలతో నిండిపోయి, మృతదేహాలను ఖననం చేయడానికి కూడా చోటు లేకుండా పోయిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గ్రామపంచాయతీ పరిధిలో పారిశుధ్య వ్యవస్థ పూర్తిగా కూలిపోయినట్టే కనిపిస్తోంది. ప్రభుత్వం స్వచ్ఛత కోసం ప్రతి సంవత్సరం లక్షల రూపాయలు కేటాయిస్తున్నప్పటికీ, ఆ నిధులు ఎక్కడికి వెళ్తున్నాయో ప్రజలకు అర్థం కావడం లేదు. చెత్తను శాస్త్రీయంగా నిర్వహించి, ఎరువుగా మార్చాల్సిన బాధ్యతను గ్రామ కార్యదర్శులు పూర్తిగా నిర్లక్ష్యం చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

“చెత్తతో సంపద” అనే లక్ష్యాన్ని పక్కన పెట్టి, గ్రామంలో సేకరించిన చెత్తను స్మశానంలో పడవేసి, దానికే నిప్పు పెట్టించడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఫలితంగా స్మశాన వాటికలో దాదాపు ఏడాది పొడవునా మంటలు చెలరేగుతూనే ఉంటున్నాయి. ఈ పరిస్థితుల వల్ల గ్రామంలో ఎవరైనా మరణిస్తే, ఖననం చేయడానికి కనీసం ఆరడుగుల స్థలం కూడా దొరకని దుస్థితి ఏర్పడింది. మృతుల పట్ల కనీస గౌరవం కూడా లేకుండా పోయిందని గ్రామస్తులు మండిపడుతున్నారు.

చెత్త నుండి వస్తున్న దుర్వాసనతో ఆ ప్రాంతం మొత్తం ఊపిరి పీల్చుకోలేని స్థితికి చేరింది. అదే దారిలో సత్యవరం, కోయేటిపాడు, కాకలేరు గ్రామాల ప్రజలు రాకపోకలు సాగించాల్సి రావడం మరింత బాధాకరం. ముఖ్యంగా విద్యార్థులు ప్రతిరోజూ ఈ దారిలోనే పాఠశాలకు వెళ్లాల్సి రావడం వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

“స్మశానాన్ని కూడా వదలని నిర్లక్ష్యం ఇదేనా?” అంటూ స్థానికులు అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చెత్తను తొలగించి, స్మశాన వాటికకు గౌరవాన్ని పునరుద్ధరించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

E.ABRAHAM, ACHANTA

E.ABRAHAM, ACHANTA

Next Story