Polavaram: అర్నబ్ తుఫానును సమర్థవంతంగా ఎదుర్కొన్నాం: కలెక్టర్ దినేష్

Polavaram: అర్నబ్ తుఫాను వల్ల పోలవరం జిల్లాలో 100 మి.మీ. వర్షపాతం నమోదైనా సమన్వయంతో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టామని కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు.

Prasanna, Rampachodavaram
Published on: 30 Oct 2026 8:57 PM IST
Polavaram
X

Polavaram: అర్నబ్ తుఫానును సమర్థవంతంగా ఎదుర్కొన్నాం: కలెక్టర్ దినేష్

Polavaram: అర్నబ్ తుఫాను ప్రభావం కారణంగా పోలవరం జిల్లాలో ఎటువంటి ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరగకుండా జిల్లా యంత్రాంగం సమన్వయంతో ముందస్తు చర్యలు చేపట్టి తుఫానును సమర్థవంతంగా ఎదుర్కొన్నామని జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ తెలిపారు.

శుక్రవారం రాత్రి రంపచోడవరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్, జిల్లా ఎస్పీ కె. చక్రవర్తి, జాయింట్ కలెక్టర్ సురపాటి ప్రశాంత్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అర్నబ్ తుఫాను ప్రభావంతో సుమారు 100 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని తెలిపారు. తుఫాను హెచ్చరికలు వెలువడిన వెంటనే అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేసి, ఎక్కడికక్కడ ముందస్తు సహాయక చర్యలు చేపట్టేలా ఏర్పాట్లు చేశామని వివరించారు.

24 గంటల పాటు అందుబాటులో కంట్రోల్ రూమ్‌లు

తుఫాను పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించేందుకు జిల్లావ్యాప్తంగా వివిధ స్థాయిల్లో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు. జిల్లా యంత్రాంగంలోని అన్ని శాఖల అధికారులు, సిబ్బంది 24 గంటల పాటు విధులు నిర్వహిస్తూ పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించారని పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు తక్షణ సహాయం అందించేలా సంబంధిత శాఖల మధ్య సమన్వయం ఏర్పాటు చేశామని తెలిపారు.

విద్యుత్, రహదారుల పునరుద్ధరణకు ప్రత్యేక బృందాలు

తుఫాను ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు దెబ్బతినడం, రహదారులపై చెట్లు విరిగిపడటం వంటి పరిస్థితులు ఏర్పడినప్పటికీ, సంబంధిత శాఖల సిబ్బంది వెంటనే స్పందించారని కలెక్టర్ తెలిపారు. దెబ్బతిన్న విద్యుత్ లైన్లను పునరుద్ధరించి విద్యుత్ సరఫరాను తిరిగి అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు చేపట్టామని చెప్పారు. రహదారులపై విరిగిపడిన చెట్లను ప్రత్యేక బృందాల ద్వారా తొలగించి, వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా రహదారులను పునరుద్ధరించినట్లు వివరించారు.

గర్భిణులకు ప్రత్యేక వైద్య సేవలు

తుఫాను పరిస్థితుల నేపథ్యంలో జిల్లాలోని గర్భిణీ స్త్రీలను ముందుగానే గుర్తించి, వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక వైద్య ఏర్పాట్లు చేశామని కలెక్టర్ తెలిపారు. అవసరమైన గర్భిణులను సంబంధిత ఆసుపత్రుల్లో చేర్పించి వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. ప్రజల భద్రత, ఆరోగ్య పరిరక్షణకు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని తెలిపారు

సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు

జిల్లాలోని అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సమష్టి కృషి, పరస్పర సమన్వయంతో అర్నబ్ తుఫాను పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొన్నామని కలెక్టర్ పేర్కొన్నారు. ఎటువంటి ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరగకుండా సహాయక చర్యలు చేపట్టడంలో సహకరించిన ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, పాత్రికేయులకు జిల్లా యంత్రాంగం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులోనూ విపత్తుల సమయంలో ఇదే విధమైన సమన్వయం, అప్రమత్తతతో పనిచేస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ కె. చక్రవర్తి, జాయింట్ కలెక్టర్ సురపాటి ప్రశాంత్ కుమార్ పాల్గొన్నారు.

Prasanna, Rampachodavaram

Prasanna, Rampachodavaram