Ramagundam: ఆపరేషన్ ముస్కాన్-12 ద్వారా 278 మంది పిల్లల రక్షణ సిపి
Ramagundam: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆపరేషన్ ముస్కాన్-XII ద్వారా 278 మంది బాలకార్మికుల రక్షణ. వివరాలు వెల్లడించిన CP అంబర్ కిషోర్ ఝా.
Ramagundam: ఆపరేషన్ ముస్కాన్-12 ద్వారా 278 మంది పిల్లల రక్షణ సిపి
రామగుండము: బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనతో పాటు పిల్లల భద్రతను పరిరక్షించే లక్ష్యంతో ప్రతి సంవత్సరం రెండుసార్లు ఆపరేషన్ స్మైల్ మరియు ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ అంబర్ కిషోర్ ఝా తెలిపారు.
ప్రభుత్వ శాఖల సమన్వయంతో 'ఆపరేషన్ ముస్కాన్–XII' ద్వారా తప్పిపోయిన, వదిలివేయబడిన, అలాగే కిరాణా దుకాణాలు,మెకానిక్ షాపులు,హోటళ్లు, వివిధ పరిశ్రమలు, సంస్థలు,ఇతర వ్యాపార సంస్థలు మరియు రోడ్లపై భిక్షాటన చేస్తున్న బాలలను గుర్తించి, వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించి అప్పగించడం లేదా అవసరమైతే బాలల సంరక్షణ గృహాలకు తరలించడం జరుగుతుందని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆపరేషన్ ముస్కాన్–XII కార్యక్రమాన్ని పెద్దపల్లి,మంచిర్యాల జిల్లాల పోలీసు అధికారులు,సిబ్బంది, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, కార్మిక శాఖ, విద్యాశాఖ,బాలల సంరక్షణ శాఖ,వైద్య ఆరోగ్య శాఖ తదితర ప్రభుత్వ శాఖల సమన్వయంతో విజయవంతంగా నిర్వహించినట్లు ఒక ప్రకటనలో తెలిపారు.
కమిషనరేట్ పరిధిలోని ప్రతి డివిజన్‌కు ఒక ఎస్‌ఐతో పాటు నలుగురు పోలీసు సిబ్బందితో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి,ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థల సహకారంతో విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు.ఈ ఏడాది జూలై 1 నుండి 31వ తేదీ వరకు నిర్వహించిన ఆపరేషన్ ముస్కాన్–XIIలో కమిషనరేట్ వ్యాప్తంగా మొత్తం 278 మంది బాలబాలికలను గుర్తించి రక్షించినట్లు వెల్లడించారు.
పెద్దపల్లి జిల్లా పరిధిలో 130 మంది బాలురు,21 మంది బాలికలు, మొత్తం151 మంది బాలలను గుర్తించి రక్షించగా,11 కేసులు నమోదు చేసి12 మందిని అరెస్టు చేశారు. మంచిర్యాల జిల్లా పరిధిలో 102 మంది బాలురు,25 మంది బాలికలు, మొత్తం 127 మంది బాలలను గుర్తించి రక్షించగా,6 కేసులు నమోదు చేసి 7 మందిని అరెస్టు చేశారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ,బాలల హక్కులను పరిరక్షించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని అన్నారు.బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. బాలల హక్కుల పరిరక్షణ కోసం ఆపరేషన్ స్మైల్ మరియు ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు.
ఎవరైనా బాలలను పనిలో పెట్టుకున్నట్లు,బాల కార్మికులుగా పనిచేయిస్తున్నట్లు, లేదా తప్పిపోయిన, వదిలివేయబడిన బాలల సమాచారం తెలిసిన వెంటనే చైల్డ్ హెల్ప్‌లైన్–1098 లేదా డయల్–100కు సమాచారం అందించాలని ప్రజలను కోరారు.
బాల కార్మికులను నియమించిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఆపరేషన్ ముస్కాన్–XII విజయవంతానికి సహకరించిన వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు,సిబ్బంది మరియు పోలీసు సిబ్బందిని పోలీస్ కమిషనర్ అభినందించారు.




