Family Suicide: గోదావరిలో దూకి కుటుంబం ఆత్మహత్య.. దారుణానికి కారణం ఇదే

Family Suicide: అప్పుల బాధ తాళలేక ఒకే కుటుంబానికి చెందిన నలుగురు గోదావరిలోకి దూకిన దారుణ ఘటన తణుకు పట్టణంలో తీవ్ర శోకాన్ని నింపింది.

CR Reddy
Published on: 7 Sept 2026 8:09 AM IST
Family Suicide
X

Family Suicide

Family Suicide: అప్పుల బాధ తాళలేక ఒకే కుటుంబానికి చెందిన నలుగురు గోదావరిలోకి దూకిన దారుణ ఘటన తణుకు పట్టణంలో తీవ్ర శోకాన్ని నింపింది. ఈ ఘోరంలో తండ్రి, కొడుకు, కూతురు ప్రాణాలు కోల్పోగా, ప్రాణాపాయం నుంచి బయటపడిన తల్లి ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతోంది. పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణంలోని స్త్రీ సమాజం వీధిలో నివాసముంటున్న నంబూరి శ్రీనివాస్, ఆయన భార్య పద్మిని, కుమారుడు వెంకటఈశ్వర్, కుమార్తె నిత్యశ్రీ శనివారం తెల్లవారుజామున యలమంచిలి మండలం చించినాడ వంతెన వద్దకు చేరుకున్నారు. జీవితంపై విరక్తి చెంది నలుగురూ ఒక్కసారిగా ప్రవహిస్తున్న గోదావరి నదిలోకి దూకేశారు. గమనించిన స్థానిక జాలర్లు వెంటనే స్పందించి పద్మినిని సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చారు. శ్రీనివాస్ తో పాటు వారి ఇద్దరు పిల్లలు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి ముగ్గురి మృతదేహాలను వెలికితీశారు.

మృత్యువుతో పోరాడుతున్న తల్లి

జాలర్ల సమయస్ఫూర్తి వల్ల ప్రాణాలతో బయటపడిన పద్మినిని వెంటనే ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె తీవ్ర అస్వస్థతతో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. మరో 24 గంటలు గడిస్తే కానీ ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఏమీ చెప్పలేమని వైద్యులు తెలిపారు. అసలు కన్నపిల్లలను కూడా ఆత్మహత్యకు పురిగొలిపేంత తీవ్రమైన పరిస్థితులు ఏమి వచ్చాయి, వీరిని ఎవరు అంతగా ఒత్తిడికి గురిచేశారనే విషయాలు పద్మిని కోలుకుని స్పృహలోకి వస్తేనే బయటపడే అవకాశముంది.

వ్యాపారంలో నష్టాలు.. అప్పుల ఊబిలో కుటుంబం

స్థానికంగా పాలు, కిరాణా దుకాణం నిర్వహిస్తున్న శ్రీనివాస్ కుటుంబానికి వచ్చే ಆదాయం చాలా స్వల్పంగా ఉండేది. వ్యాపార పెట్టుబడులు, షాపు అద్దె, ఇంటి అద్దెతో పాటు పిల్లల చదువుల కోసం శ్రీనివాస్ పలువురి వద్ద అప్పులు చేశారు. అప్పులు తీర్చే మార్గం లేక పద్మిని తన తల్లి ఇంటిని కూడా తాకట్టు పెట్టి కొంత సొమ్ము తీసుకువచ్చారు. అయినప్పటికీ రోజువారీ టెండర్లు, చీటీల రూపంలో తెచ్చిన అప్పులకు వడ్డీలు కొండలా పెరిగిపోయాయి. నానాటికీ అప్పుల భారం ఎక్కువ కావడంతో నిరంతరం మానసిక వేదన అనుభవించేవారు.

నెలకు రూ.20 వేల వడ్డీల భారం

తీసుకున్న అప్పులు తీర్చేందుకు ఇటీవల ఇంట్లో ఉన్న బంగారాన్ని కూడా అమ్మేసినట్లు స్థానికులు చెబుతున్నారు. ఎంత కట్టినా అసలు తగ్గకపోగా, ప్రతినెలా కేవలం వడ్డీల రూపంలోనే రూ.20 వేలకు పైగా చెల్లించాల్సి రావడం ఆ కుటుంబాన్ని కోలుకోలేని దెబ్బతీసింది. అప్పు ఇచ్చిన వారి నుంచి రోజురోజుకూ ఒత్తిడి పెరగడంతో తట్టుకోలేక ఈ దారుణ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story