Tanuku: పైడిపర్రులో ఆధునికీకరించిన పీఏసీఎస్ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
Tanuku: తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ పైడిపర్రులో రూ.20 లక్షలతో ఆధునికీకరించిన పీఏసీఎస్ సొసైటీ భవనాన్ని ప్రారంభించి, రైతుల ప్రగతిని వివరించారు.
Tanuku: పైడిపర్రులో ఆధునికీకరించిన పీఏసీఎస్ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
తణుకు: రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. రూ. 20 లక్షలతో ఆధునికీకరించిన పైడిపర్రు గణేష్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పీఏసీఎస్) భవనాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు.
సహకార సంఘాలు రైతులకు ఆర్థికంగా అండగా నిలుస్తూ వ్యవసాయ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. రైతులకు అవసరమైన రుణాలు, ఎరువులు, ధాన్యం సేకరణ వంటి సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు సొసైటీలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
1,610 మంది సభ్యులతో సొసైటీ ప్రగతి
పైడిపర్రు, సజ్జాపురం, తణుకు, మండపాక, ఎర్రనీలికుంట గ్రామాల పరిధిలో 1960లో ఏర్పాటైన ఈ సొసైటీలో ప్రస్తుతం 1,610 మంది సభ్యులు ఉన్నారని తెలిపారు. ఈ ఏడాది 812 మంది సభ్యులకు సుమారు రూ.11 కోట్ల మేర రుణాలు అందించినట్లు వెల్లడించారు.
సొసైటీ పరిధిలో రూ.2 కోట్లకు పైగా ఎరువుల వ్యాపారం నిర్వహించడంతో పాటు రూ.95 లక్షల మేర షేర్ ధనం ఉందన్నారు. రైతులు తీసుకున్న రుణాలను 100 శాతం సకాలంలో తిరిగి చెల్లించడంతో సొసైటీ లాభాల బాటలో పయనిస్తోందని తెలిపారు. రుణాల ద్వారా సొసైటీకి సుమారు రూ.24 లక్షల వడ్డీ ఆదాయం సమకూరిందని, రైతులకు ప్రతి ఏటా కనీసం 8 శాతం డివిడెండ్ అందజేస్తున్నట్లు వివరించారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సొసైటీ పరిధిలో సుమారు రూ.16.75 కోట్ల విలువైన ధాన్యాన్ని సేకరించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీబీ చైర్మన్ ఆకుల బాబు, కూటమి నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.




