Tanuku: విద్యావాలి స్కూల్ మూసివేత - విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన
Tanuku: తణుకులో విద్యావాలి స్కూల్ మూసివేతతో విద్యార్థుల భవిష్యత్తుపై ఆందోళన. డీవైఈఓ పరిశీలన, ఇరు పాఠశాలలకు షోకాజ్ నోటీసులు జారీ చేసే అవకాశం.
Tanuku: విద్యావాలి స్కూల్ మూసివేత - విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన
తణుకు: పట్టణంలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ రోడ్డులో ఉన్న విద్యావాలి ఇంగ్లీష్ మీడియం స్కూల్ మూసివేత వ్యవహారం విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళనకు దారితీసింది. సుమారు 130 మందికి పైగా ఎల్‌కేజీ నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులు చదువుతున్న ఈ పాఠశాలను అనివార్య కారణాలతో మూసివేసి, తేతలిలోని స్టెప్పింగ్ స్టోన్ సీబీఎస్ఈ స్కూల్‌కు విద్యార్థులను తరలిస్తున్నట్లు యాజమాన్యం తెలిపినట్లు సమాచారం.
విద్యావాలి పాఠశాలలో రాష్ట్ర సిలబస్, స్టెప్పింగ్ స్టోన్‌లో సీబీఎస్ఈ సిలబస్ అమలులో ఉండటంతో విద్యార్థుల భవిష్యత్తుపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం ఏఐఎస్బీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి వంశీ, విద్యార్థి సంఘ నాయకులు స్టెప్పింగ్ స్టోన్ స్కూల్‌ను సందర్శించి యాజమాన్యాన్ని ప్రశ్నించారు. విషయం తెలుసుకున్న డీవైఈఓ మురళి సత్యనారాయణ పాఠశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి వివరాలను అడిగితెలుసుకున్నారు.
నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు తేలితే ఇరు పాఠశాలలకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని తెలిపారు. ఇదిలా ఉంటే విద్యాహక్కు చట్టం కింద ఉచిత సీట్లు పొందిన విద్యార్థుల పరిస్థితిపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న పేదల పిల్లలకు ప్రభుత్వం ప్రైవేట్ విద్యాసంస్థల్లో 25 శాతం సీట్లను కేటాయించింది.
అయితే ఈ ఉచిత షేర్లకు కూడా స్టెప్పింగ్ స్టోన్ స్కూల్లో ఫీజులను చెల్లించమనడంతో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వ్యతిరేకతమవుతోంది. ఉచిత సీట్లకు ఇబ్బంది లేకుండా, విద్యార్థుల చదువు మధ్యలో ఆగకుండా విద్యాశాఖ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఏఐఎస్బీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి వంశీ, తల్లిదండ్రులు కోరుతున్నారు.




