East Godavari: స్వగ్రామానికి చేరుకోకముందే గాలిలో కలిసిన ప్రాణాలు!

East Godavari: తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. నిద్రమత్తులో కారు స్తంభాన్ని ఢీకొనడంతో ఈ విషాదం చోటుచేసుకుంది.

PAMULA NAGENDRA BABU, GOPALAPURAM
Published on: 22 April 2026 4:53 PM IST
East Godavari
X

East Godavari: స్వగ్రామానికి చేరుకోకముందే గాలిలో కలిసిన ప్రాణాలు!

తూర్పు గోదావరి జిల్లా: నల్లజర్ల మండలం అనంతపల్లి సమీపంలోని వీరవల్లి టోల్ ప్లాజా వద్ద విషాదకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. టోల్ ప్లాజాకు సుమారు 500 మీటర్ల దూరంలో జరిగిన ఈ ప్రమాదం స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. సమాచారం ప్రకారం, బాధితులు చెన్నైలోని ఒక ఆసుపత్రికి వెళ్లి తిరిగి తమ స్వగ్రామమైన తాళ్లపూడి మండలం గజ్జరం వైపు ప్రయాణిస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. తెల్లవారుజామున సుమారు రెండు గంటల సమయంలో డ్రైవర్‌కు నిద్రమత్తు రావడంతో వాహనం అదుపు తప్పి రహదారి పక్కన ఉన్న స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. ఢీకొట్టిన ప్రభావం తీవ్రంగా ఉండడంతో కారులో ప్రయాణిస్తున్నవారిలో ఒకరు ఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. మరొ ఇద్దరిని వెంటనే ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స కొనసాగుతోంది.

ఈ ప్రమాదంలో మృతి చెందినవారిని చాపర్ల రాజు, చాపర్ల హనుమంతరావు, దుద్దుపూడి సాగర్‌గా గుర్తించారు. ఘటన అనంతరం స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టి గాయపడిన వారిని బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను గోపాలపురం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఘటనపై సమాచారం అందుకున్న నల్లజర్ల పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటనతో ప్రాంతంలో విషాద వాతావరణం నెలకొంది. డ్రైవింగ్ సమయంలో జాగ్రత్తలు పాటించకపోతే ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయని అధికారులు హెచ్చరిస్తున్నారు.

PAMULA NAGENDRA BABU, GOPALAPURAM

PAMULA NAGENDRA BABU, GOPALAPURAM

Next Story