Veeravasaram: పెర్మిపాలెం అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన కేంద్రమంత్రి!

Veeravasaram: వీరవాసరం పెర్మిపాలెం అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, ఎమ్మెల్యే రామాంజనేయులు చిన్నారులకు పండ్లు, స్వీట్ల పంపిణీ టీచర్లకు సన్మానం.

ALLURI KANAKRAJU (ARUN), BHIMAVARAM
Published on: 29 Sept 2026 7:43 PM IST
Veeravasaram
X

Veeravasaram: పెర్మిపాలెం అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన కేంద్రమంత్రి!

వీరవాసరం, సెప్టెంబర్ 29: ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజా సేవా 'సంకల్ప అభియాన్'లో భాగంగా వీరవాసరం మండలం పెర్మిపాలెం అంగన్‌వాడీ (ప్రీ ప్రైమరీ) స్కూల్‌ను కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, భీమవరం ఎమ్మెల్యే ,పీఏసీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులుతో కలసి మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా వారు అంగన్‌వాడీ పిల్లలతో ఆప్యాయంగా ముచ్చటించి, వారికి స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు.

అంగన్‌వాడీ కేంద్రాలలో చిన్నారులకు విశేష సేవలందిస్తున్న టీచర్లు, ఆయాల సేవలను ప్రశంసించి వారిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ మాట్లాడుతూ.. గుజరాత్ ముఖ్యమంత్రిగా 13 ఏళ్లు, దేశ ప్రధానిగా 12 ఏళ్లు.. మొత్తంగా 25 సంవత్సరాలుగా నరేంద్ర మోదీ నిరంతరం ప్రజా సేవకే అంకితమయ్యారని కొనియాడారు.

ఆయన అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లాలనే ఉద్దేశ్యంతోనే దేశవ్యాప్తంగా నెల రోజులపాటు కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఆరోగ్యవంతమైన పౌరులు ఉంటేనే కుటుంబం, తద్వారా దేశం అభివృద్ధి చెందుతుందని ఆయన పేర్కొన్నారు. అందుకోసం గర్భిణీలు, బాలింతలు, పసిపిల్లల ఆరోగ్యంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాయని వివరించారు.

గర్భం దాల్చినప్పటి నుండి బిడ్డ జన్మించి, పాఠశాలకు వెళ్లేంత వరకు పౌష్టికాహారం అందించాల్సిన బాధ్యతను ప్రభుత్వాలు తీసుకున్నాయన్నారు. ఇందులో భాగంగా అంగన్‌వాడీల ద్వారా గుడ్లు, పౌష్టికాహారం అందించడంతో పాటు, గర్భిణీలకు ఆర్థిక సాయం (రూ. 5000/రూ. 6000) అందిస్తున్నామని గుర్తుచేశారు.

ఈ పథకాలను సద్వినియోగం చేసుకునేలా తల్లులకు అవగాహన కల్పించడంలో అంగన్‌వాడీ టీచర్లు, ఆశా వర్కర్ల పాత్ర ఎంతో కీలకమన్నారు. పెర్మిపాలెం అంగన్‌వాడీ కేంద్రం నిర్వహణ తీరుపై, పిల్లలు చురుకుగా స్పందిస్తున్న విధానంపై కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ ప్రత్యేకంగా హర్షం వ్యక్తం చేశారు.

నిరుపేద కుటుంబాలకు భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY), ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన (PMSBY) పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని శ్రీనివాస వర్మ విజ్ఞప్తి చేశారు.

కేవలం నామమాత్రపు ప్రీమియంతో (రూ. 12లు, రూ. 300లు) ప్రమాదవశాత్తు లేదా సహజ మరణం సంభవిస్తే ఆయా కుటుంబాలకు 2 లక్షల రూపాయల ఆర్థిక భద్రత లభిస్తుందని, దీనిపై గ్రామంలోని ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించి నమోదు చేయించాలన్నారు.

గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు నిధుల కొరత లేదని, డ్రైనేజీలు, రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వాలు కట్టుబడి ఉన్నాయని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు నార్ని తాతాజీ, లీలా కృష్ణ, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, NDA కూటమి నాయకులు, అంగన్‌వాడీ సిబ్బంది, ఆశా వర్కర్లు, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ALLURI KANAKRAJU (ARUN), BHIMAVARAM

ALLURI KANAKRAJU (ARUN), BHIMAVARAM