Bhimavaram: పారదర్శక ఎన్నికల కోసమే ఓటర్ల జాబితా ప్రక్షాళన

Bhimavaram: పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రచార ఆటోలను ప్రారంభించారు.

ALLURI KANAKRAJU (ARUN), BHIMAVARAM
Published on: 12 July 2026 12:50 PM IST
Bhimavaram
X

Bhimavaram: పారదర్శక ఎన్నికల కోసమే ఓటర్ల జాబితా ప్రక్షాళన

భీమవరం: దేశంలో ఎన్నికల ప్రక్రియ అత్యంత పారదర్శకంగా సాగేందుకు డూప్లికేట్, మరణించిన వారి ఓట్లతో పాటు అక్రమంగా నమోదైన వారి ఓట్లను తొలగించడం అత్యంత ఆవశ్యకమని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ స్పష్టం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) కార్యక్రమంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు భీమవరంలోని జిల్లా బిజెపి కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన 25 ప్రచార ఆటోలను ఆదివారం కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన స్వయంగా ఆటోను నడిపి ప్రచార కార్యక్రమానికి ఉత్సాహంగా శ్రీకారం చుట్టారు. కేంద్రమంత్రి స్వయంగా ఆటో నడపడంతో బీజేపీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ మాట్లాడుతూ.. విదేశాలు లేదా ఇతర ప్రాంతాల నుంచి వచ్చి అక్రమంగా స్థిరపడి ఓటర్లుగా నమోదైన వారిని గుర్తించి, వారి పేర్లను జాబితా నుంచి తొలగించేలా ఎన్నికల సంఘం కఠిన చర్యలు చేపట్టిందన్నారు. ఇది మూడో విడత ప్రత్యేక సవరణ కార్యక్రమమని, గత రెండు విడతల్లో అస్సాం, బీహార్, పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున అనర్హుల ఓట్లను గుర్తించారని గుర్తుచేశారు.

ఒక్క పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోనే దాదాపు 90 లక్షల అనర్హుల ఓట్లు ఉన్నాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య మనుగడకు అర్హులైన వారికే ఓటు హక్కు ఉండాలని, ఈ సవరణ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు.

నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రతి మండలం, గ్రామంలో ప్రజలను చైతన్యపరిచేందుకు ఆటోలు, రిక్షాల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. కరపత్రాల పంపిణీతో పాటు బిజెపి కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. 18 ఏళ్లు నిండిన అర్హులైన యువతీ యువకులు, ఇంకా ఓటు హక్కు నమోదు చేసుకోని ప్రతి ఒక్కరూ వెంటనే ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

జిల్లా బీజేపీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి పౌరుల్లో ఓటు హక్కుపై చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర మీడియా సెల్ సభ్యులు కపర్ది, జిల్లా ప్రధాన కార్యదర్శి కలిదిండి వినోద్ వర్మ, సీనియర్ నాయకులు సుభాష్ రాజు, సాయి దుర్గరాజు, షేక్ మొహుద్దీన్, అడబాల శివ, బలరామరాజు, వబిలిశెట్టి ప్రసాద్, నాగమణి తదితర నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ALLURI KANAKRAJU (ARUN), BHIMAVARAM

ALLURI KANAKRAJU (ARUN), BHIMAVARAM

Next Story