Bhimavaram: భీమవరంలో ప్రధాని మోదీ బర్త్‌డే వేళ లక్ష దీపోత్సవం!

Bhimavaram: ప్రధాని మోదీ జన్మదినం వేళ భీమవరంలో ఘనంగా లక్ష ఆశీర్వాద దీపోత్సవం. పాల్గొన్న కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు.

ALLURI KANAKRAJU (ARUN), BHIMAVARAM
Updated on: 18 Sept 2026 8:44 PM IST
Bhimavaram
X

Bhimavaram: భీమవరంలో ప్రధాని మోదీ బర్త్‌డే వేళ లక్ష దీపోత్సవం!

భీమవరం: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని భీమవరంలో "సేవా సంకల్ప అభియాన్" కార్యక్రమం వివిధ ప్రాంతాల్లో ఘనంగా జరిగింది.

కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ నివాసం వద్ద గురువారం జరిగిన ఈ అపూర్వ ఘట్టంలో భీమవరం ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులుతో కలిసి కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ లక్ష ఆశీర్వాద దీపాలను వెలిగించారు.

ప్రధాని నరేంద్ర మోడీ అజేయ నాయకత్వంలో భారతదేశం విశ్వగురు స్థానానికి చేరుకోవాలని, ఆ భగవంతుడు ఆయనకు సంపూర్ణ ఆయురారోగ్యాలు, దీర్ఘాయుష్షు ప్రసాదించాలని ఆకాంక్షిస్తూ ఈ లక్ష దీపోత్సవాన్ని నిర్వహించారు.

25 ఏళ్ల నిరంతర ప్రజాసేవలో నరేంద్ర మోడీ ఈ సందర్భంగా కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ మాట్లాడుతూ.. దేశ ప్రయోజనాలే పరమావధిగా పనిచేస్తున్న నరేంద్ర మోడీ లాంటి శక్తివంతమైన నాయకుడు దేశానికి ఎంతో అవసరమన్నారు.

గుజరాత్ ముఖ్యమంత్రిగా 13 సంవత్సరాలు, భారత ప్రధానమంత్రిగా 12 సంవత్సరాలు.. మొత్తంగా 25 ఏళ్ల పాటు ఎటువంటి మచ్చా లేకుండా నిరంతర ప్రజాసేవలో ఉన్న ఏకైక నాయకుడు నరేంద్ర మోడీ అని కొనియాడారు.

దేశ విదేశాల్లో కుట్రలు జరుగుతున్నా వాటిని దీటుగా ఎదుర్కొంటూ భారతదేశాన్ని అగ్రగామిగా నిలబెడుతున్నారని ప్రశంసించారు. అందుకే ఆయనకు దీర్ఘాయుష్షు కలగాలని దేశవ్యాప్తంగా 140 కోట్ల మంది భారతీయులు దీపాలు వెలిగించి ప్రార్థిస్తున్నారని తెలిపారు.

ఎన్డీఏ ప్రభుత్వ పదేళ్ల పాలనలో సాధించిన ప్రగతి

గత ప్రభుత్వాల హయాంలో సామాన్యులకు అందని కనీస మౌలిక సదుపాయాలను 2014 తర్వాత ప్రధాని మోడీ సాకారం చేశారని మంత్రి శ్రీనివాస వర్మ వివరించారు. జీరో బ్యాలెన్స్ తో 'జన్ ధన్ యోజన' ద్వారా 55 కోట్ల మందికి బ్యాంకు ఖాతాలు తెరిపించి ఆర్థిక సాధికారత కల్పించారని, 'ఉజ్వల పథకం' ద్వారా 30 కోట్ల మందికి ఉచిత గ్యాస్ కనెక్షన్లు అందించి మహిళలకు పొగబారి నుంచి విముక్తి కల్పించారని గుర్తుచేశారు.

'స్వచ్ఛ భారత్' కింద 60 కోట్ల మరుగుదొడ్లు నిర్మించి మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడటంతో పాటు, చీకట్లో మగ్గుతున్న లక్ష గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించారని పేర్కొన్నారు. 'జీవన్ జ్యోతి', 'సురక్షా బీమా యోజన' పథకాలతో సామాన్యులకు అతి తక్కువ ప్రీమియంతో సామాజిక భద్రత కల్పించారని ఆయన వివరించారు.

ప్రధాని మోడీకి అండగా నిలవాలని పిలుపు

సొంత ప్రయోజనాలను పక్కనపెట్టి, దేశ హితం కోసం కఠిన నిర్ణయాలు తీసుకుంటూ, అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ను తీర్చిదిద్దే దిశగా అడుగులు వేస్తున్న ప్రధాని మోడీకి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని కేంద్రమంత్రి పిలుపునిచ్చారు. పార్లమెంట్ నియోజకవర్గ స్థాయిలో జరిగిన ఈ ఆశీర్వాద దీపోత్సవ కార్యక్రమంలో భారీ సంఖ్యలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

ALLURI KANAKRAJU (ARUN), BHIMAVARAM

ALLURI KANAKRAJU (ARUN), BHIMAVARAM