Bhimavaram: 13 కోట్ల ఓట్ల తొలగింపు ఆరోపణలు అవాస్తవం: కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ!

Bhimavaram: 13 కోట్ల ఓట్ల తొలగింపు ఆరోపణలు పచ్చి అబద్ధం కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ఫైర్ అది కేవలం ఈసీ ముసాయిదా మాత్రమేనని భీమవరంలో మీడియా ముఖంగా స్పష్టీకరణ.

ALLURI KANAKRAJU (ARUN), BHIMAVARAM
Published on: 29 Sept 2026 7:37 PM IST
Bhimavaram
X

Bhimavaram: 13 కోట్ల ఓట్ల తొలగింపు ఆరోపణలు అవాస్తవం: కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ!

భీమవరం, సెప్టెంబర్ 29: వరుస ఓటములతో ప్రతిపక్ష కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, తమ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికే రాజ్యాంగబద్ధమైన ఎన్నికల సంఘంపై ‘ఓట్ చోరీ’ అనే అసత్య ప్రచారం తెరపైకి తెచ్చారని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

ప్రధాని నరేంద్ర మోదీ గారి ఇమేజ్‌ను ఏమీ చేయలేక, విపక్షాలు నేరుగా ఎన్నికల సంఘం (ECI)పై నిరాధార ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆయన మండిపడ్డారు. భీమవరంలోని బీజేపీ కార్యాలయంలో జిల్లా నాయకులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి మాట్లాడారు.

దేశవ్యాప్తంగా 13 కోట్ల ఓట్లు ఉద్దేశపూర్వకంగా తొలగించబడ్డాయని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు పచ్చి అబద్ధమని శ్రీనివాస వర్మ కొట్టిపారేశారు. అది కేవలం అభ్యంతరాల కోసం ఎన్నికల సంఘం పబ్లిక్ డొమైన్‌లో ఉంచిన ముసాయిదా (డ్రాఫ్ట్) జాబితా మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు.

ఈ డ్రాఫ్ట్ జాబితాలో 2 కోట్ల 80 లక్షల మంది మరణించిన వారు, 3 కోట్ల మంది ఆచూకీ లేని వారు ఉన్నారని ఆయన వివరించారు. అలాగే, 6 కోట్ల 30 లక్షల మంది ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా వలస వెళ్ళినవారు ఉండగా, ఒకే వ్యక్తికి రెండు లేదా అంతకంటే ఎక్కువ చోట్ల ఓట్లు ఉన్న కోటి మందికి పైగా డూప్లికేట్ ఓటర్లు ఉన్నారని స్పష్టం చేశారు.

ఈ ముసాయిదాపై ఏ పార్టీకైనా, ఏ వ్యక్తికైనా అభ్యంతరాలు ఉంటే 'ఫారం-7' లేదా 'ఫారం-8' ద్వారా దరఖాస్తు చేసుకునే పారదర్శకమైన అవకాశం ఉందని కేంద్ర మంత్రి గుర్తుచేశారు. ఎన్నికల సంఘం ప్రస్తుతం సంవత్సరానికి నాలుగు సార్లు ఓటరు నమోదు ప్రక్రియను ఎంతో పారదర్శకంగా నిర్వహిస్తోందని తెలిపారు.

దేశంలో 1952 నుండి ఓటర్ల జాబితా సవరణ (SR) ప్రక్రియ ఎన్నోసార్లు జరిగిందని, ఆ సమయంలో ఏడుసార్లు కాంగ్రెస్ పార్టీ మరియు దాని కూటమే అధికారంలో ఉందన్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. సీఈసీ యాక్ట్-2023 ప్రకారం ఎన్నికల సంఘం నిర్ణయాలన్నీ ముగ్గురు కమిషనర్ల ఏకగ్రీవ ఆమోదంతోనే జరుగుతున్నాయని, కమిషనర్లు విభేదించారు అన్నది కేవలం పత్రికల్లో వచ్చిన ఊహాగానాలేనని కొట్టిపారేశారు.

గతంలో కాంగ్రెస్ హయాంలో ఎలక్షన్ కమిషనర్ల నియామకానికి ఎలాంటి చట్టం లేదని, కానీ మోడీ గారి ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టంలో తొలిసారిగా 'ప్రతిపక్ష నాయకుడికి' కూడా ఎంపిక కమిటీలో స్థానం కల్పించారని వివరించారు.

కొత్త ఓటరు నమోదు కోసం ఉన్న ఫారం-6 మార్పులపై కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ స్పష్టం చేశారు. ఫారం-6ను ఎక్కడా మార్చలేదని, గతంలో ఫారం-6 మరియు డిక్లరేషన్ ఫారం వేర్వేరుగా ఉండి రెండుసార్లు ఓటీపీలు రావడంతో ప్రజలు ఇబ్బంది పడేవారని వివరించారు. ఓటర్ల సౌలభ్యం కోసమే ఆ రెండింటినీ కలిపి ఒకే ప్రక్రియగా చేశారని, దీనిని మే 27, 2026న సుప్రీంకోర్టు కూడా సమర్థించిందని గుర్తుచేశారు. ప్రజలకు సౌకర్యంగా ఉంటే కాంగ్రెస్ ఓర్వలేకపోతోందని విమర్శించారు.

ప్రజాస్వామ్యంలో ఒక వ్యక్తికి ఒక చోట మాత్రమే ఓటు హక్కు ఉండాలనే కనీస అవగాహన రాహుల్ గాంధీకి లేకపోవడం శోచనీయమని, నకిలీ ఓట్లు, చనిపోయిన వారి ఓట్లను తొలగించడాన్ని ఆయన వ్యతిరేకించడం బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని శ్రీనివాసవర్మ విమర్శించారు. దేశవ్యాప్తంగా కొత్తగా నమోదైన 2 కోట్ల 36 లక్షల మంది జెన్-జెడ్ (Gen Z) ఓటర్లు బీజేపీకి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వానికే అండగా ఉన్నారని కేంద్రమంత్రి తెలిపారు.

56 ఏళ్ల వయసున్న రాహుల్ గాంధీ తాను యువకుడినని, జెన్-జెడ్ ప్రతినిధినని చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు. ఉమ్మడి లక్ష్యం లేని ఇండీ కూటమి ఇప్పటికే చెల్లాచెదురైపోయిందని, ఆ కూటమికి దేశంలో భవిష్యత్తు లేదని ఆయన ఎద్దేవా చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ గారి ఇమేజ్‌ను ఏమీ చేయలేక, ఇప్పుడు నేరుగా రాజ్యాంగబద్ధమైన ఎన్నికల సంఘంపైనే బురద జల్లుతున్నారని దుయ్యబట్టారు.

తమిళనాడు, పంజాబ్, తెలంగాణ, కేరళ లాంటి రాష్ట్రాల్లో గెలిచినప్పుడు ఈవీఎంలు సక్రమంగానే పనిచేసినట్లు భావించే విపక్షాలు, ఓడిపోయినప్పుడు మాత్రం ఈవీఎంలను తప్పుబట్టడం వారి ద్వంద్వ వైఖరికి నిదర్శనమన్నారు. పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో విదేశీ శక్తులకు, బంగ్లాదేశ్ అక్రమ వలసదారులకు ఓటు హక్కు కల్పించి లబ్ధి పొందాలని మమతా బెనర్జీ చూసారని ఆరోపించారు.

గతంలో రాఫెల్ స్కామ్, చౌకీదార్ చోర్ హై, పనామా పేపర్స్ తదితర విషయాల్లో అసత్య ప్రచారం చేసి, కోర్టుల మొట్టికాయల తర్వాత ప్రజలకు క్షమాపణలు చెప్పిన చరిత్ర రాహుల్ గాంధీకి ఉందని కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ ఎద్దేవా చేశారు. విదేశాలకు వెళ్లిన ప్రతిసారీ భారతదేశ ప్రతిష్టను, ప్రజాస్వామ్య వ్యవస్థలను ప్రపంచం ముందు కించపరిచేలా రాహుల్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

ఇప్పుడు ఎన్నికల సంఘంపై నిరాధార ఆరోపణలు చేస్తూ రాజ్యాంగ సంస్థలను అగౌరవపరుస్తున్నారని, ఇందుకు గానూ ఆయన దేశ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పారదర్శకమైన ప్రజాస్వామ్య ప్రక్రియపై బురదజల్లడం మాని, ప్రతిపక్షాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ సూచించారు.

ఈ విలేకరుల సమావేశంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సుభాష్ రాజు, కాయిత సురేంద్ర, జిల్లా ప్రధాన కార్యదర్శి తోట గంగరాజు, భీమవరం మండలాధ్యక్షుడు వబిలిశెట్టి ప్రసాద్ తదితరు పాల్గొన్నారు.

ALLURI KANAKRAJU (ARUN), BHIMAVARAM

ALLURI KANAKRAJU (ARUN), BHIMAVARAM