Narsapuram: తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన పారిశుద్ధ్యం!

Narsapuram: నరసాపురం మున్సిపాలిటీలో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన పారిశుద్ధ్య పనులు, వీధి దీపాల పునరుద్ధరణ చేపట్టినట్లు చైర్‌పర్సన్ తెలిపారు.

POTHUMUDI MUTYALU, NARASAPURAM
Published on: 19 Nov 2026 7:36 PM IST
Narsapuram
X

Narsapuram: తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన పారిశుద్ధ్యం!

పశ్చిమగోదావరి జిల్లా: నరసాపురం మున్సిపాలిటీ పరిధిలో తుఫాన్ కారణంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను వేగవంతం చేసి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు చేపట్టామని మున్సిపల్ చైర్‌పర్సన్ కొత్తపల్లి శైలజ జానకిరామ్ తెలిపారు.

తుఫాన్ ప్రభావంతో పట్టణంలోని పలు ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయని, విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయని, వీధి దీపాలు పనిచేయక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆమె పేర్కొన్నారు. అయితే మున్సిపల్ సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన రంగంలోకి దిగి, పడిపోయిన చెట్లను తొలగించి, రహదారులను శుభ్రం చేసి, పారిశుద్ధ్య సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్నారని వెల్లడించారు.

దెబ్బతిన్న విద్యుత్ స్తంభాలు, వీధి దీపాల స్థానంలో కొత్త స్తంభాలు, కొత్త లైట్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా గోదావరి పరివాహక ప్రాంతంలో కార్తీక మాసం సందర్భంగా భక్తులు, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేకంగా వీధి దీపాల ఏర్పాటుపై దృష్టి సారించామని చెప్పారు.

నరసాపురం మున్సిపాలిటీలోని మొత్తం 36 వార్డుల్లోనూ దశలవారీగా అభివృద్ధి, పారిశుద్ధ్య పనులు చేపడుతూ, దెబ్బతిన్న ప్రాంతాలను పూర్తిస్థాయిలో పునరుద్ధరించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని కొత్తపల్లి శైలజ జానకిరామ్ స్పష్టం చేశారు.

తుఫాన్ వచ్చినా ప్రజలకు ఇబ్బందులు రాకూడదు.. ప్రతి వీధిలో వెలుగులు నిండాలి.. ప్రతి వార్డులో పరిశుభ్రత వెల్లివిరియాలి.. ఇదే మా లక్ష్యం! అని ఆమె పేర్కొన్నారు.

POTHUMUDI MUTYALU, NARASAPURAM

POTHUMUDI MUTYALU, NARASAPURAM