Penugonda: 'యోగాంధ్ర–2026' జోరు.. 4.5 లక్షల రిజిస్ట్రేషన్లే లక్ష్యం!
Penugonda: పశ్చిమగోదావరి జిల్లాలో 'యోగాంధ్ర–2026' కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు.
Penugonda: 'యోగాంధ్ర–2026' జోరు.. 4.5 లక్షల రిజిస్ట్రేషన్లే లక్ష్యం!
Penugonda: పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ, యోగాంధ్ర–2026 కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని వర్గాల ప్రజలతో విస్తృత స్థాయిలో రిజిస్ట్రేషన్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డితో కలిసి ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, ప్రత్యేక అధికారులు మరియు వివిధ శాఖల జిల్లా అధికారులతో యోగాంధ్ర–2026 కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ జిల్లాలో 4.5 లక్షల మంది పౌరులతో యోగ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయడమే లక్ష్యమన్నారు. విద్యార్థులు, మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, యోగ కేంద్రాలు, యోగపై ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ నమోదు చేసుకునేలా విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు.
జూన్ 7 నుంచి 21 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమాల నేపథ్యంలో జిల్లాలో గ్రామ, మండల, పురపాలక సంఘాల స్థాయిలో ప్రతిరోజూ యోగా కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. యోగ ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపట్టాలన్నారు. జూన్ 14న పెనుగొండ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థాన ప్రాంగణంలో 2,500 మందితో, జూన్ 19న స్పోర్ట్స్ అథ్లెటిక్స్ మైదానంలో 1,500 మందితో ప్రత్యేక యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
అలాగే జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జిల్లాస్థాయిలో మెగా యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. యోగాంధ్ర కార్యక్రమాల్లో భాగంగా గ్రామ, మండల, డివిజన్ స్థాయిలలో యోగాసనాలు, క్విజ్, పెయింటింగ్, వ్యాసరచన తదితర పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేయాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి యోగాంధ్ర–2026ను జిల్లాలో పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పిలుపునిచ్చారు.




