Penumantra: పెనుమంట్రలో మురసు తుఫాను బీభత్సం: మునిగిన వేలాది ఎకరాలు!
Penumantra: పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలంలో మురసు తుఫాను తీవ్ర నష్టం మిగిల్చింది. గోస్తాని నది పొంగి వరి పంట మునిగిపోగా, జగనన్న కాలనీ జలమయమై ప్రజలు విలవిల్లాడుతున్నారు.
Penumantra: పెనుమంట్రలో మురసు తుఫాను బీభత్సం: మునిగిన వేలాది ఎకరాలు!
పెనుమంట్ర: పశ్చిమ గోదావరి జిల్లా, ఆచంట నియోజకవర్గం, పెనుమంట్ర మండలంలో మురసు తుఫాను బీభత్సం సృష్టించింది. పెనుమంట్ర, నత్తరామేశ్వరం, ఎస్. ఇలింద్రపర్రు, మల్లిపూడి, జుత్తుగా గ్రామాలు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.
గోస్తాని నది ఉగ్రరూపం:
తుఫాను ధాటికి గోస్తాని నది పొంగి పొర్లింది. నదిలో విరిగిపడిన భారీ చెట్లు, గుర్రపు డెక్క అడ్డుపడటంతో నీరు ముందుకు వెళ్లక వెనక్కి తన్ని వేల ఎకరాల్లో కోతకు వచ్చిన వరి పంట పూర్తిగా నీట మునిగి నాశనమయ్యింది. చేతికి వచ్చిన పంట కళ్ళ ముందే కొట్టుకుపోవడంతో రైతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
అధికారులు ఎక్కడ?
ఒక ప్రక్క జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు, మరో ప్రక్క తుఫాను పనులతో అధికారులు తలమునకలై ఉన్నారని చెబుతున్నా, క్షేత్రస్థాయిలో సహాయం అందడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ కొన్ని గ్రామాలలో కరెంటు పునరుద్ధరణ కాకపోవడంతో ప్రజలు చీకటిలోనే కాలం గడుపుతున్నారు. తాగునీటికి కూడా ఇబ్బంది పడుతున్నారు.
జగనన్న కాలనీ జలమయం.
పెనుమంట్ర మండలంలోని ప్రధాన రహదారి మార్టేరు -టు -తాడేపల్లిగూడెం రోడ్డును ఆనుకుని ఉన్న జగనన్న కాలనీ పూర్తిగా జలమయమైంది. ఇళ్లలోకి మోకాలి లోతు నీరు చేరడంతో ప్రజలు ఇళ్లలోకి వెళ్లలేని దుస్థితి. చిన్న పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు.
ప్రజల డిమాండ్.
వెంటనే పంట నష్టం అంచనా వేసి రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి, గోస్తాని నదిలో అడ్డుపడిన చెట్లు, గుర్రపు డెక్కను తొలగించి నీటి ప్రవాహాన్ని సరిచేయాలి, జగనన్న కాలనీలో నీటిని తోడి ప్రజలకు పునరావాసం కల్పించాలిఅని అన్ని గ్రామాలలో వెంటనే కరెంటు పునరుద్ధరించాలి, ప్రభుత్వం వెంటనే స్పందించి బాధితులను ఆదుకోకపోతే రైతులు ఆందోళనకు దిగుతామని హెచ్చరిస్తున్నారు.




