Tanuku: కారుమూరి అరెస్టుకు నిరసనగా తణుకులో వైఎస్సార్‌సీపీ కొవ్వొత్తుల ర్యాలీ!
Tanuku: నాగేశ్వరరావు అరెస్టును నిరసిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నరేంద్ర కూడలిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించాయి.
Tanuku: కారుమూరి అరెస్టుకు నిరసనగా తణుకులో వైఎస్సార్‌సీపీ కొవ్వొత్తుల ర్యాలీ!
తణుకు: మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కారుమూరి వెంకట నాగేశ్వరరావు అరెస్టును నిరసిస్తూ ఆయనకు మద్దతుగా తణుకు నరేంద్ర కూడలిలో సోమవారం వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కారుమూరికి మద్దతుగా నినాదాలు చేస్తూ, ఫ్లకార్డులు ప్రదర్శించారు.
ఈ కార్యక్రమంలో తణుకు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ప్రచార కమిటీ నాయకుడు గెల్లా జగన్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, ఆయన తనయుడు సునీల్‌పై అక్రమ కేసులు బనాయించిందని ఆరోపించారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన కీలక నాయకుడిగా ఉన్న కారుమూరిని రాజకీయంగా అణగదొక్కేందుకు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
శాంతియుతంగా కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ నిర్వహిస్తుంటే కూటమి ప్రభుత్వం ఓర్వలేక పోలీసులను అడ్డుపెట్టుకుని కార్యక్రమానికి ఆటంకాలు కల్పించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపే హక్కును కూడా కూటమి ప్రభుత్వం అడ్డుకుంటోందని ఆరోపించారు.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కొనే ధైర్యం లేకే కూటమి ప్రభుత్వం రాజకీయ కక్షపూరిత ధోరణులకు పాల్పడుతోందని జగన్ దుయ్యబట్టారు. కారుమూరి అరెస్టుతో వైఎస్సార్‌సీపీ శ్రేణులు మరింత ఐక్యంగా పోరాడతాయని అన్నారు. ఈ సందర్భంగా జై కారుమూరి.. జై జై కారుమూరి” అంటూ ప్లకార్డులతో నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో తణుకు నియోజకవర్గానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




