Tanuku: కూటమి వైఫల్యాలపై తణుకులో వైఎస్ఆర్సీపీ సమరశంఖం!

Tanuku: తణుకులో వైఎస్ఆర్సీపీ నేతలు వడ్లూరి సీతారాం, సాయిబాబా రెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 18 Jun 2026 3:50 PM IST
Tanuku
X

Tanuku: కూటమి వైఫల్యాలపై తణుకులో వైఎస్ఆర్సీపీ సమరశంఖం!

తణుకు: వైఎస్ఆర్సీపీ పంచాయతీరాజ్ వింగ్ రాష్ట్ర కార్యదర్శి వడ్లూరి సీతారాం మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మద్యం షాపుల ద్వారా 24 గంటలు మద్యం అందుబాటులో ఉంచి వేల కుటుంబాల జీవితాలను నాశనం చేస్తోందని ఆరోపించారు. సూపర్ సిక్స్ హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని, రైతులకు గిట్టుబాటు ధరలు, ఎరువులు అందడం లేదని విమర్శించారు.

విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, పుస్తకాలు, యూనిఫాంలు అందలేదని, "తల్లికి వందనం" నిధులు కూడా ఖాతాల్లో జమ కాలేదని అన్నారు. జగన్ ప్రభుత్వం సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థ ద్వారా లక్షల మందికి ఉపాధి కల్పించిందని, ప్రస్తుత ప్రభుత్వం వాటిని నిర్వీర్యం చేసిందని ఆరోపించారు.

మెగా డీఎస్సీ పేరుతో పారదర్శకత లేకుండా నియామకాలు జరిగాయని విమర్శించారు. కొత్త పెన్షన్లు మంజూరు చేయడం లేదని, వృద్ధులు, వితంతువులు, వికలాంగులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ వ్యవస్థను బలహీనపరిచి పేదలను ప్రైవేట్ ఆస్పత్రుల వైపు మళ్లిస్తున్నారని ఆరోపించారు.

తేతలి గ్రామపంచాయతీకి వచ్చే పన్ను ఆదాయం తగ్గించారని, లేహం ఫుడ్ ఫ్యాక్టరీకి పన్ను మినహాయింపు ఎందుకు ఇచ్చారో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తణుకు నియోజకవర్గాన్ని అభివృద్ధిలో పదో స్థానంలో ఉందని చెబుతున్నప్పటికీ పేకాట, గోవధ,గంజాయి, క్రికెట్ బెట్టింగ్, హత్యలు పెరిగాయని విమర్శించారు.

నాడు-నేడు, గోరుముద్ద వంటి పథకాల ద్వారా జగన్ ప్రభుత్వం విద్యా రంగాన్ని బలోపేతం చేసిందని, ప్రస్తుతం విద్యా వ్యవస్థ నిర్వీర్యమైందని అన్నారు. కూటమి ప్రభుత్వం నిర్వహించిన రెండేళ్ల విజయోత్సవ సభ స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా రాజకీయ ప్రచార కార్యక్రమంగా మారిందని ఆరోపించారు.

వైఎస్ఆర్సీపీ రాష్ట్ర లీగల్ సెల్ ప్రతినిధి సాయిబాబా రెడ్డి మాట్లాడుతూ జూన్ 12న నిర్వహించిన చంద్రబాబు "రెండేళ్ల వెన్నుపోటు పాలనకు" నిరసనగా చెప్పట్టిన శాంతియుత ర్యాలీలో పాల్గొన్న కార్యకర్తల్లో 35 మందికఫై కేసులు నమోదు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని విమర్శించారు.

బుధవారం జరిగిన కూటమి ప్రభుత్వం విజయోత్సవ సభకు అనుమతులు ఇచ్చారా..? ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించిన వారిపై పోలీసులు ఏమి చర్యలు తీసుకున్నారు ..? అని ప్రశ్నించారు. ప్రజా సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించినందుకు కేసులకు భయపడబోమని, ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ప్రతి ఒక్కరి హక్కు అని స్పష్టం చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story