Tanuku: రిలే నిరాహార దీక్షలు డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణకు డిమాండ్!

Tanuku: మెగా డీఎస్సీ ఉపాధ్యాయ నియామకాలలో భారీ అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ తణుకు ఎమ్మార్వో కార్యాలయం వద్ద వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు.

Kallem Murali, Tanuku (West godavari dist)
Published on: 6 Aug 2026 11:22 PM IST
Tanuku
X

Tanuku: రిలే నిరాహార దీక్షలు డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణకు డిమాండ్!

తణుకు: మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ నియామక ప్రక్రియలో భారీ అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆదేశాల మేరకు తణుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మార్వో కార్యాలయం సమీపంలో గురువారం రిలే నిరాహార దీక్షలు చేపట్టారు.

ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాద్ రాజు మాట్లాడుతూ, డీఎస్సీ నియామకాల్లో జరిగిన అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రశ్నాపత్రాల లీకేజీలు, స్పోర్ట్స్ కోటా నియామకాల్లో జరిగిన అక్రమాలపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)తో సమగ్ర విచారణ జరిపించాలని కోరారు.

విద్యార్థులకు అందాల్సిన సుమారు రూ.7 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు (విద్యా దీవెన, వసతి దీవెన) వెంటనే విడుదల చేయాలని, ఎన్నికల హామీ మేరకు నిరుద్యోగ యువతకు నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నరసాపురం పార్లమెంట్ పరిశీలకుడు మురళీకృష్ణంరాజు, తణుకు నియోజకవర్గ పరిశీలకుడు కొట్టు నాగు మాట్లాడుతూ, మెగా డీఎస్సీ నియామక ప్రక్రియను "మెగా స్కామ్"గా అభివర్ణించారు.

ఎస్సీఈఆర్‌టీకి చెందిన కొందరు అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రశ్నాపత్రాల రూపకల్పన, అప్‌లోడింగ్ బాధ్యతలు అప్పగించడం వల్లే పేపర్ లీక్ జరిగిందని ఆరోపించారు. అదేవిధంగా నిర్దేశిత అర్హతలు (బి.ఎడ్., టెట్) లేని వారికి, గుర్తింపు లేని క్రీడా సర్టిఫికెట్ల ఆధారంగా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు కల్పించారని విమర్శించారు. ఎంపికైన అభ్యర్థుల పూర్తి మెరిట్ జాబితాలను కలెక్టరేట్ కార్యాలయాల్లో లేదా అధికారిక వెబ్‌సైట్లలో వెల్లడించకుండా, కేవలం ఎంపికైన వారికి మాత్రమే ఎస్‌ఎంఎస్‌ల ద్వారా సమాచారం ఇవ్వడం అనుమానాలకు తావిస్తోందన్నారు.

ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకులు శేషగిరిరావు, వడ్లూరి సీతారాం, జల్లూరి జగదీష్, గెల్లా జగన్, శ్రీకాంత్, మహిళా నాయకులు మేహరున్నిసా బేగం, కనకదుర్గ, రామకృష్ణ, జిలానీ, పైడి సాయి సూర్య తదితరులు పాల్గొన్నారు.

Kallem Murali, Tanuku (West godavari dist)

Kallem Murali, Tanuku (West godavari dist)

Next Story