Viral Video: సోషల్ మీడియా పిచ్చి..శానిటైజర్ తో నిప్పు రాజేసి బుక్కైన కుర్రాడు

Viral Video: సోషల్ మీడియా పిచ్చి..శానిటైజర్ తో నిప్పు రాజేసి బుక్కైన కుర్రాడు
x
Highlights

సోషల్ మీడియా పిచ్చి..శానిటైజర్ తో నిప్పు రాజేసి బుక్కైన కుర్రాడు

Viral Video: సోషల్ మీడియాలో పాపులర్ అవ్వాలనే పిచ్చితో జనాలు రకరకాల విన్యాసాలు చేస్తుంటారు. కొన్నిసార్లు ఈ విన్యాసాలు ప్రాణాల మీదకు తెస్తుంటాయి. తాజాగా ఒక వ్యక్తి చేసిన ఓవర్ స్మార్ట్ ప్రయత్నం అతనికి ఊహించని షాక్ ఇచ్చింది. చేతులకు శానిటైజర్ రాసుకుని నిప్పు అంటించుకుంటే ఏదో మ్యాజిక్ జరుగుతుందని ఆశించిన ఆ వ్యక్తికి.. మరుక్షణమే నిప్పు సెగ తగిలి చుక్కలు కనిపించాయి. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది.

నేటి కాలంలో రీల్స్ చేయడానికి, వీడియోలు వైరల్ చేయడానికి జనం ఎంతటి సాహసానికైనా సిద్ధపడుతున్నారు. కానీ ఆ సాహసం వెనుక ఉండే ప్రమాదాన్ని మాత్రం గుర్తించలేకపోతున్నారు. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో ఒక యువకుడు మెట్ల దగ్గర నిలబడి ఒక చిన్న శానిటైజర్ బాటిల్ చూపిస్తాడు. ఏదో పెద్ద మ్యాజిక్ చేయబోతున్నట్లు బిల్డప్ ఇస్తూ ఆ శానిటైజర్ మొత్తాన్ని తన రెండు చేతులకు రాసుకుంటాడు. శానిటైజర్‌లో ఆల్కహాల్ ఉంటుందని, అది త్వరగా నిప్పును అంటుకుంటుందని తెలిసినా కూడా అతను అత్యుత్సాహం ప్రదర్శించాడు.

చేతులకు శానిటైజర్ పూసుకున్న తర్వాత, ఆ కుర్రాడు ఒక లైటర్‌ని తీసి తన చేతికి నిప్పు అంటించడానికి ప్రయత్నిస్తాడు. బహుశా అతనేదో ఫైర్ మ్యాజిక్ జరుగుతుందని ఊహించి ఉండవచ్చు. కానీ, లైటర్ వెలిగించిన మరుక్షణం చేతులకు ఉన్న శానిటైజర్ ఒక్కసారిగా అంటుకుని మంటలు చెలరేగాయి. ఆ మంటల వేడికి తట్టుకోలేక అతను నడిరోడ్డుపై గెంతులు వేస్తూ, తన చేతులను ఆర్పడానికి నానా తంటాలు పడతాడు. కేవలం 18 సెకన్ల వ్యవధి ఉన్న ఈ వీడియో చూస్తుంటే.. ప్రాణాపాయం నుంచి తృటిలో తప్పించుకున్నాడని అర్థమవుతోంది.

ఈ వీడియోను Xలో @palwi_333 అనే ఐడితో షేర్ చేశారు. "తనను తాను పెద్ద విన్యాసకారుడు అనుకున్నాడు.. కానీ చివరికి లంక దహనం అయ్యింది" అనే క్యాప్షన్‌తో ఈ వీడియోను పోస్ట్ చేశారు. ఇప్పటికే వేలాది మంది ఈ వీడియోను చూశారు. నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. "నిప్పుతో చెలగాటం ఆడకూడదని పెద్దలు ఊరికే అనలేదు" అని ఒకరు కామెంట్ చేయగా, "లైకుల కోసం ఇంత దిగజారాలా?" అని మరొకరు మండిపడ్డారు.

ఇలాంటి ప్రమాదకరమైన వీడియోలు చూసి పిల్లలు లేదా ఇతర యువకులు ప్రేరణ పొందకుండా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. శానిటైజర్లలో ఉండే అధిక శాతం ఆల్కహాల్ మంటలను విపరీతంగా పెంచుతుంది. ఒక చిన్న పొరపాటు జరిగినా అది తీవ్రమైన కాలిన గాయాలకు, ఒక్కోసారి ప్రాణహానికీ దారితీస్తుంది. సోషల్ మీడియాలో గుర్తింపు కోసం చేసే ఇలాంటి వెర్రి చేష్టలు చివరికి కన్నీళ్లే మిగిలిస్తాయని ఈ వీడియో మరోసారి నిరూపించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories